
రాజా రవి వర్మ (Raja Ravivarma) భారతీయ చిత్రకారుడు. అతను రామాయణ, మహాభారతములలోని ఘట్టాలను చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందాడు. భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువల సంగమానికి అతని చిత్రాలు చక్కని మచ్చుతునకలు. 1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.
రాజా రవి వర్మ ఈనాటి భారతదేశములోని కేరళలో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులకు ఏప్రిల్ 29, 1848న జన్మించాడు. చిన్నతనములోనే ఇతను చూపిన ప్రతిభ వలన ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామ స్వామి నాయుడు శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. పాశ్ఛ్యాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసము భారత దేశమంతటా పర్యటించాడు. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవాడు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యముగా మహాభారతములోని నలదమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించాడు. రాజా రవి వర్మ తరువాత నుండి భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవి వర్మ చిత్రాలలాగా మారిపోయాయి. రవి వర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ ఉంటాడన్న విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్థి పొందింది.
రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగల కోసం విపరీతంగా ముద్రించటము వలన, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించటము వలనా సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శను ఎదుర్కొన్నాడు.
రాజ రవి వర్మ శైలి ప్రబావం ఎందరో ప్రముఖుల పైన ఉందని చెప్పొచ్చు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అయిన దాదాసాహెబ్ ఫాల్కే కూడా రవి వర్మ చిత్రాల వల్ల ప్రభావితమైనవాడే.
భారతీయ చిత్రకళా చరిత్రలో గొప్ప చిత్రకారునిగా గుర్తింపు పొందిన రాజా రవి వర్మ, 1906లో, 58 సంవత్సరాల వయసులో మధుమేహంతో మరణించాడు. ఈయన మరణించేనాటికి కిలామానూరు ప్యాలెస్‌లో 160 దాకా రవివర్మ చిత్రాలు ఉండేవని ప్రతీతి. ఆ తరువాత వాటిని అధికారికముగా తిరువనంతపురములోని చిత్రా ఆర్ట్ గ్యాలరీకి అందజేశారు.
క్రింది చిత్రాలు రాజా రవి వర్మ కు ఎంతో పేరు తెచ్చినవి:
పల్లె పడుచు
అలోచనలో మునిగిపోయిన స్త్రీ
దమయంతి హంస సంవాదము
వాద్యకారుల బృందము
సుభద్రార్జునులు
లేడీ విత్ ఫ్రూట్స్
హార్ట్ బ్రోకెన్
స్వర్బత్ ప్లేయర్
శకుంతల
శ్రీ కృష్ణ రాయబారము
రావణ జటాయు వధ
ఇంద్రజీత్ విజయము
బిక్షకుల కుటుంబము
లేడీ ప్లేయింగ్ స్వర్బత్
గుడి వద్ద దానాలు ఇస్తున్న స్త్రీ
వరుణుని జయించిన రాముడు
నాయర్ల స్త్రీ
శృంగారంలో మునిగిన జంట
కీచకుని కలవటానికి భయపడుతున్న ద్రౌపది
శంతనుడు మత్స్యగంధి
ప్రేమలేఖ వ్రాస్తున్న శకుంతల
కణ్వుని ఆశ్రమములోని బాలిక.(ఋషి కన్య).
కొన్ని చిత్రాలను ఇక్కడ చూడండి